40వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన కంగనా రనౌత్

  • కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన కంగనా రనౌత్
  • తన జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు అని పేర్కొన్న కంగన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈరోజు తన 40వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కంగనా కుటుంబంతో ప్రధాని సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తన పుట్టినరోజు సందర్భంగా ప్రధానిని కలిసిన కంగనా, ఆయనకు హిమాచల్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక అందమైన శాలువాను కప్పారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ 'దశావతారాన్ని' అద్భుతంగా చిత్రీకరించిన ఇత్తడి వాల్ ఫ్రేమ్‌ను ప్రధానికి బహుమతిగా అందజేశారు. ముఖ్యంగా కంగనా మేనల్లుడితో ప్రధాని ఆడుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. "గౌరవనీయ ప్రధానమంత్రి గారి అపాయింట్ మెంట్ దొరకడం, ఆయన మార్గదర్శకత్వం లభించడం నా అదృష్టం. ఇది నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు" అంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.


రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కంగన మళ్లీ వెండితెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మనోజ్ తాపారియా దర్శకత్వంలో రాబోతున్న ఓ క్రేజీ ప్రాజెక్టులో కంగనా ఒక పవర్‌ఫుల్ 'నర్సు' పాత్రలో కనిపించబోతున్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మెడికల్ స్టాఫ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దీని షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఆర్.మాధవన్‌తో కలిసి నటించబోయే 'తను వెడ్స్ మను 3' ఫ్రాంచైజీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Kangana Ranaut
Narendra Modi
Kangana Ranaut birthday
PM Modi
Bollywood actress
Mandi BJP MP
Kangana meets Modi
Tanu Weds Manu 3
Anand L Rai
Nurse movie

More Telugu News